టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి తొలి బహిరంగ సభ ‘తెలుగు జన విజయకేతన జెండా’కు సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ నిర్వహించనున్నారు. తొలి భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు. వారిద్దరూ హెలికాప్టర్లో వేదిక వద్దకు చేరుకుంటారు. రెండు పార్టీల ముఖ్య నాయకులు, ఇన్‌చార్జులు, కమిటీల ప్రతినిధులు 500 మంది వరకు వేదికపై ఆశీనులు కానున్నారు. ఐదు లక్షల మంది జనం తరలివస్తారని అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ ‘వైసీపీ సభలు మాత్రమే జరగాలి. ఇతర పార్టీలు ఏవీ కూడా సభలు నిర్వహించకూడదు. సభలు నిర్వహిస్తే అవాంతరాలు సృష్టిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ విముక్త రాష్ట్రం కోసమే టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకున్నాయి. ప్రజలంతా స్వాగతిస్తున్నారు’ అని చెప్పారు.