రాజధాని అమరావతిలో భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించిన భూముల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట కేటాయించేందుకు సీఆర్డీయే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కొండెపాటి కరుణ, మరికొందరు రైతులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి తాము తగిన ఉత్తర్వులు జారీ చేసేవరకు పిటిషనర్లకు ఇప్పటికే కేటాయించిన ప్లాట్లను రద్దు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మరోచోట ప్లాటు తీసుకొనేందుకు సమ్మతించిన రైతుల విషయంలో నిబంధనలను అనుసరించి కేటాయింపు ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే అప్పీల్ దాఖలు చేశాయి. వారి తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘సీఆర్డీయే చట్టం ప్రకారం భూ సేకరణవిధానం కింద తీసుకున్న భూముల్లో మాత్రమే రైతులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. పిటిషనర్లలో కొందరికి భూసేకరణ ద్వారా తీసుకున్న భూమిలో ప్లాటు కేటాయించారు. ఈ నేపఽథ్యంలోనే వారికి కేటాయించిన ప్లాటును రద్దు చేసి, వేరే చోట ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాదులు సాయి సంజయ్ సూరనేని, కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్ల ప్లాట్లను రద్దు చేస్తూ సీఆర్డీయే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. పిటిషనర్లకు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించలేదు. కేటాయించిన ప్లాటును రద్దు చేసే అధికారం సీఆర్డీయేకు లేదు. రద్దు చేసి మరోచోట కేటాయించాలనుకుంటే సీఆర్డీయే అధికారులు తగిన కారణాన్ని చూపించాలి. ప్రస్తుత కేసులో ఏ కారణంతో పిటిషనర్ ప్లాటు రద్దు చేశారో చెప్పలేదు. చట్ట నిబంధనలు అనుసరించడంలో అధికారులు విఫలమయ్యారు’’ అని తెలిపారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... రైతులకు ఇచ్చిన ప్లాట్లు రద్దు చేసే విషయంలో ప్రాథమిక, సహజ న్యాయసూత్రాలు పాటించడంలో అధికారులు విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులకు మరోచోట తిరిగి ప్లాట్లు కేటాయించే విషయంలో సీఆర్డీయే ఇచ్చిన ప్రొసీడింగ్స్, తదనంతరం రైతులకు ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.