ఆమె ప్రైవేటు స్కూల్‌లో ఉద్యోగి. అతడి పిల్లలు అదే స్కూల్‌లో విద్యాభ్యాసం చేస్తున్నారు. పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు తీసుకుని మాట్లాడుకునే వరకు వెళ్లింది. ఉన్నట్టుండి ఆమె ఉంటున్న ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి వెళ్లింది. ఆమె తనతో ఇంకా దూరం పెంచుకుంటుందని భావించి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం శ్రీనగర్‌కాలనీలో మంగళవారం రాత్రి జరిగింది. గుడివాడకు చెందిన వక్కలగడ్డ మాధురి అక్కడున్న ఓ ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తోంది. ఆమె భర్త మరో ప్రైవేటు స్కూల్‌లో ఉద్యోగి. వారికి ఒక పాప, బాబు ఉన్నారు. గుడివాడకు చెందిన నాని అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. మాధురి పనిచేసే స్కూల్‌లో విద్యాభ్యాసం చేస్తున్నారు. చేపల వ్యాపారం చేసుకునే నాని రోజూ పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లి దింపుతుంటాడు. ఈ క్రమంలో మాధురితో నానికి పరిచయం పెరిగింది. ఒకరి ఫోన్ నంబర్‌ను మరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం మాధురి భర్తకు తెలిసింది. పలుమార్లు హెచ్చరించినా ఆమె ప్రవర్తన మారకపోవడంతో విజయవాడ శ్రీనగర్ కాలనీలో జాగర్లమూడి వారి వీధిలో ఉంటున్న ఇంటికి పిల్లలతో సహా పంపించేశాడు. వారం రోజుల క్రితం మాధురి గుడివాడ నుంచి బీఆర్టీఎస్ రోడ్డులో ఉన్న బ్రాంచ్‌కు బదిలీపై వచ్చింది. శ్రీనగర్ కాలనీ నుంచి స్కూల్‌కి వెళ్లి వస్తోంది. పిల్లలను ఇదే స్కూల్‌లో చేర్పించింది. తల్లి కుందేటి కనకదుర్గతో కలిసి మాధురి జీవిస్తోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నానితో మాధురి ఫోన్‌లో సంభాషణలు చేసినట్టు తెలిసింది. ఈ సమయంలోనే తాను ఉంటున్న చిరునామాను నానికి చెప్పిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక గుడివాడకు వచ్చే అవకాశం లేదని మాధురి చెప్పడంతో నాని కొబ్బరిబొండాల కత్తి తీసుకుని జాగర్లమూడి వారి వీధిలోకి వచ్చాడు. తల్లి కనకదుర్గ ఇంట్లో లేకపోవడంతో మంగళవారం రాత్రి మాధురి, నాని కాసేపు మాట్లాడుకున్నారు. పిల్లలు ఇద్దరూ పక్క గదిలో ఉన్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే నాని ఆమెను మెడపై కత్తితో బలంగా నరికాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోయిన తర్వాత అదే హాలులో చీరతో నాని ఉరిపోసుకున్నాడు. స్థానికులు గమనించి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ పి.వెంకటనారాయణ వెంటనే తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాని అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కొన ఊపిరితో రక్తపు మడుగులో ఉన్న మాధురిని పోలీసు జీపులో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసును సత్యనారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.