ఉత్తరాంధ్రవాసులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు పాసింజర్ రైలు సౌకర్యం సమకూరనుంది. ఈ ప్రాంతం నుంచి విశాఖ వెళ్లి వచ్చేందుకు వీలుగా పాసింజర్ రైలు లేకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ బాధితులు వేకువజామున బస్సుల్లో వెళ్లేందుకు ఎక్కువ ఖర్చు అవుతోంది. అయితే పలాస పాసింజర్ రైలును వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బ్రహ్మపుర వరకు పొడిగిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బ్రహ్మపుర వరకు పొడిగించేందుకు కృషిచేసిన ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, రైల్వే అధికారులకు టీడీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
బ్రహ్మపురలో తెల్లవారుజామున 3.50 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. ఇచ్ఛాపురం (4.09), సోంపేట (4.22), మందస (4.33) పలాస (5.00), విశాఖపట్నం (9.20) చేరుతుంది. తిరిగి విశాఖలో సాయంత్రం 5.45కు బయలుదేరి రాత్రి ఇచ్ఛాపురం (10.31) బ్రహ్మపురకు (10.47) చేరుతుంది. మరోవైపు ఈ రైలును బారువ ఆర్.ఎస్. (కొర్లాం)లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని జాగృతి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రాంబుడ్డి గణపతి అధికారులను కోరారు. ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో జిల్లాకు చెందిన ఉద్యోగులు, చిరువ్యాపా రులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.