రాజ్యసభ ఎన్నికల తర్వాత, లోక్‌సభ ఎన్నికలకు ముందు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అధికారం ఉన్నా ఒక్క రాజ్యసభ సభ్యుడిని గెలిపించుకోవడంలో విఫలమైన హిమాచల్ సర్కార్ బలంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుఖ్వీందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం లేదని.. వెంటనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు.. ప్రతిపక్ష పార్టీ నుంచి ఈ రకమైన డిమాండ్ ఉండగా.. సొంత పార్టీలో కూడా కాంగ్రెస్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. ఈ క్రమంలోనే సీఎం పట్ల అసంతృప్తి వ్యక్తి చేస్తూ మంత్రి పదవికి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని మార్చే యోచనలో హస్తం పార్టీ హై కమాండ్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రతిభా సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తరఫున 6 సార్లు సీఎంగా పని చేసిన దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య, ఆ పార్టీ సీనియర్ మహిళా నేతనే ప్రతిభా సింగ్. 1998 నుంచి ప్రతిభా సింగ్ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి 1999 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే అప్పుడు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2012 లో లోక్‌సభ ఎంపీగా ఉన్న వీరభద్ర సింగ్.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన లోక్‌సభకు రాజీనామా చేశారు. దీంతో 2013 లో ఉప ఎన్నికలు రాగా.. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిభా సింగ్.. బీజేపీ నేత జైరామ్ ఠాకూర్‌ను ఓడించారు.
2014 లో లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ వేవ్ కారణంగా ప్రతిభా సింగ్ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ 39 వేలకు పైగా ఓట్ల తేడాతో ప్రతిభా సింగ్‌పై విజయం సాధించారు. ప్రతిభా సింగ్ ఓటమితో హిమాచల్ కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ అయ్యారు. ఆ తర్వాత 2021లో ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో విజయం సాధించారు. 2022 ఏప్రిల్ 26 వ తేదీన కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిభా సింగ్‌ను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ 32 వ అధ్యక్షురాలిగా నియమించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్రతిభా సింగ్ 1956 జూన్ 16 వ తేదీన జన్మించారు. 1985లో వీరభద్ర సింగ్‌ను ప్రతిభా సింగ్ పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే వీరభద్ర సింగ్‌కు పెళ్లి కాగా.. ప్రతిభా సింగ్ ఆయనకు రెండవ భార్య. వీరభద్ర సింగ్ మొదటి భార్య కుమార్తె అభిలాషా కుమారి గుజరాత్‌లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్‌ల కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత సుఖ్వీందర్ సింగ్ సుఖు మంత్రి వర్గంలో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో విక్రమాదిత్య సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.