బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను పరారీలో ఉన్న నిందితురాలిగా కోర్టు తేల్చింది. దీంతో జయప్రదను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఈ సందర్భంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆమెను అరెస్ట్ చేసి.. తమ ముందు హాజరు పరచాలని పేర్కొంది. దీంతో అప్రమత్తమైన ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు.. జయప్రదను అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. మార్చి 6 వ తేదీ లోపు జయప్రదను తమ ముందు హాజరు పరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో జయప్రద నిందితురాలిగా ఉన్నారు. ఈ క్రమంలోనే జయప్రదను అరెస్టు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యేల స్పెషల్ కోర్టు మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జయప్రదను పరారీలో ఉన్న నిందితురాలు అని కోర్టు అధికారిక ప్రకటన చేసింది. ఆమెపై నమోదై ఉన్న రెండు కేసుల విచారణ కోసం హాజరు కావాలని 7 సార్లు నాన్‌బెయిలబుల్ వారెంట్లు పంపించినప్పటికీ.. ఆమె వాటిని పట్టించుకోలేదని కోర్టు గుర్తించింది. కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమె పరారీలో ఉన్నట్లు జడ్జి ఆదేశాలు ఇచ్చారు. జయప్రదను పట్టుకునేందుకు డీఎస్పీ ఆధ్యర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని స్పెషల్ కోర్టు జడ్జ్ శోభిత్ బన్సల్ రాంపూర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు.
ఈ క్రమంలోనే జయప్రదను వచ్చే నెల 6 వ తేదీన కోర్టులో హాజరుపరచాలని కోర్టు సూచించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున పోటీ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి.. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల సందర్భంగానే జయప్రదపై ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలతో రెండు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినా జయప్రద పట్టించుకోకపోవడంతో ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు తెలిపింది.