టెస్లా చీఫ్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్‌కు ఊహించని విధంగా ఓ సమస్య ఎదురవ్వడంతో చివరకు తన ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సాయం కోరారు. ఇటీవల మస్క్ విండోస్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయడంతో.. మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో లాగిన్ కావాల్సి వచ్చింది. కానీ, విండోస్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు ఇష్టపడని ఆయన.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తనకు ఎదురైన సమస్యను ఏకరవుపెట్టారు. కానీ, సరైన స్పందన రాకపోవడంతో చివరకు సత్య నాదెళ్లకు నేరుగా మెసేజ్ పెట్టి తన ఇబ్బంది గురించి వివరించారు. ఈ విషయాన్ని మస్క్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
‘సత్యా.. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అనాలని కాదు. కానీ, దయచేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుండా విండోస్‌ను వాడుకునేందుకు అనుమతించండి.. ఒకవేళ కంప్యూటర్ వైఫైకి కనెక్ట్ అయితే ఈ ఆప్షన్ కనిపించకుండా పోతుంది.. అదేవిధంగా నాకు వ్యక్తిగత మెయిల్ లేదు.. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా.. వర్క్ ఇ-మెయిల్ అడ్రస్ వాడుకోలేం... నాకు కేవలం వర్క్ మెయిల్స్ మాత్రమే ఉన్నాయి’ అని నాదెళ్లకు ఎలాన్ మస్క్ మెసేజ్ చేశారు. అయినా నాదెళ్ల నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు.
అంతకుముందు ఇదే అంశంపై ట్వీట్ చేసిన మస్క్.. ఎంఎస్ అకౌంట్ లేకుండా కొత్త ల్యాప్‌టాప్‌ను వినియోగించలేకపోతున్నామని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ఏఐకి తన కంప్యూటర్ యాక్సెస్ ఇవ్వాలనుకోవడం లేదన్న ఆయన.. ఇదంతా గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. ఎంఎస్ అకౌంట్ క్రియేట్ చేయకుండా సిస్టమ్ ఉపయోగించుకునే ఆప్షన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మస్క్ ట్వీట్లు సాధారణ వినియోగదారుని ఇబ్బందిని ఎత్తిచూపాయి. మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఒన్‌డ్రైవ్ స్టోరేజ్, యాప్ ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ, చాలా మంది వినియోగదారులు కొత్త ల్యాప్‌టాప్‌ను యాక్సెస్ చేసేటప్పుడు మరొక ఆన్‌లైన్ ఖాతాను క్రియేట్ చేయకుండా ఉండే ఎంపికను ఇష్టపడతారు. స్వయంగా మైక్రోసాఫ్ట్ సీఈఓను సంప్రదించడం ద్వారా మస్క్ సాధారణ కస్టమర్ ఇబ్బందిను ప్రస్తావించారని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు.