తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ఆమె బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నలుగురి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. తొలుత అరకులోయ మండలం మాదల పంచాయతీ ముసిరిగుడ గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త సొనాయి బసు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా, రెండు రోజుల క్రితమే సొనాయి బసు భార్య కాసులమ్మ బ్యాంకు ఖాతాలో రూ.మూడు లక్షల ఆర్థిక సాయాన్ని జమ చేశారు. బసు ఇంటి బయట ఆవరణలో వేచిఉన్న గ్రామ మహిళలను ఆప్యాయంగా పలకరించారు. పిల్లలకు చాకెట్లు ఇచ్చారు. అనంతరం జి.మాడుగుల మండలం లువ్వాసింగి పంచాయతీ చిట్టంపుట్టు గ్రామానికి వెళ్లి కోరాబు లక్ష్మణరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తరువాత మండల కేంద్రంలో అనసూరి రాజారావు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెబుతూ అధినేత చంద్రబాబునాయుడు పంపించిన ఉత్తరంతో పాటు రూ.3 లక్షల చెక్‌లను అందజేశారు. అక్కడ నుంచి పాడేరు మండలం కిండంగిలోని ఓండ్రు నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబీకులకు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె పాడేరులో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.