జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు.. కాపు సంక్షేమ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. జనసేన బాగు కోసం, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మంచి కోసం తానిచ్చే సలహాలు ఆయనకు నచ్చినట్లు లేదన్నారు. ఈ విషయం బహిరంగసభలో తన పేరు పెట్టి పవన్ కళ్యాణ్ అనకపోయినా ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలానే అనిపిస్తోందన్నారు. ఓ వర్గం మీడియా వారి ఈ ప్రయత్నం ముఖ్యంగా పవన్‌కు, తనకు మధ్య తగువులు పెడుతున్నట్లుగా కనబడుతోందన్నారు. పవన్‌ను మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మరింత దాసోహం అనిపించేటట్లుగా చేయాలనే కృత్రిమ చర్యలా అనిపిస్తోందన్నారు.
ఒకప్పుడు చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించినప్పుడు కానీ.. పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలంటే తెలుగుదేశం పోలిట్‌బ్యూరో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిసినప్పుడు.. జన సైనికులులలో పుట్టిన అగ్నిని పవన్ నుంచి సమాధానం రాబట్టడం ద్వారా సదరు అగ్నిపై నీరు చల్లడానికి ప్రయత్నం చేశానన్నారు. తన ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్‌లో చేశానా, వైఎస్సార్‌సీపీ ఇంట్రెస్ట్‌లో చేశానా?.. ఇవాళ జనసేనకు బలమైన నియోజకవర్గాలు, బలమైన అభ్యర్థులు 40 వరకు ఉన్నా జనసేకు కేటాయించిన సంఖ్య 24కు కుదించారన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును శాసించగల మెజారిటీ లేకుండా చేయాలనే దుర్భుద్దితో తీసుకున్న నిర్ణయం అన్నారు. చంద్రబాబు చర్యకు జనసైనికులందరు ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటే వారిని సముదాయించడం కోసం బహిరంగసభలో చంద్రబాబు వివరణ కోరటం కూడా వైఎస్సార్‌సీపీకి తాను అండ కాయటమా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై సీబీఐ అభియోగాలపై తొందరలో తీర్పును ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో తాను వేసిన పిటిషన్ కూడా వైఎస్సార్‌సీపీకి తాను కోఆర్డినేటర్గా పనిచేస్తున్నట్లేనా అన్నారు. బీజేపీ కూటమిలో చేరడానికి ఇష్టపడక.. అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబును.. పవన్ బాగు కోరే బీజేపీని అండగా ఉన్నందుకు.. తెలుగుదేశం జనసేన గూటికిలోకి తీసుకురావాలని తాను కోరుతూ ప్రకటనలు వైఎస్సార్‌సీపీ కోవర్టుగా ఇస్తున్నానా అని ప్రశ్నించారు. తనతో సహితంగా అనేకమంది కాపు సోదరులు, బడుగు బలహీన వర్గాలు నందరినీ కలుపుకుని రాజ్యాధికారం దక్కించుకోవాలని మనవాడు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే సంతోషించాలని కోరుకుంటున్నారన్నారు.
దశలువారీగా బీసీ, ఎస్సీలందరూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. తాను ఉన్నత పదవులు కూడా వదలుకుని ఒకనాడు చిరంజీవికి మద్దతు తెలిపానని.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో నష్టపోయానన్నారు. మళ్లీ పవన్ కళ్యాణ్ జనసేనపార్టీని పెట్టి ముందుకు వస్తే.. ముఖ్యమంత్రిగా చూడాలని జనసేనపార్టీలో చేరిన.. తనకు సన్నిహితంగా ఉండే 80శాతంమంది కాపులు, బీసీలు, ఎస్సీలు వర్గాలు కోరుకుంటున్నారన్నారు. జనసేన పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం నెగ్గటం అనేది సాధ్యం కాదన్నారు. అది చంద్రబాబుకి తెలియంది కాదని.. అందుకే పవన్‌తో జత కట్టారన్నారు.
వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా.. పవన్‌కు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని.. ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్‌నే ముఖ్యమంత్రిని చేస్తాడు అనే భయం జనసైనికులు అందరిలో ఉన్నమాట నిజం అన్నారు. ఎన్నికలు ముందే కూటమి అధికారంలో రావటంతో పాటు, పవన్ కళ్యాణ్ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున తాను డిమాండు చేయటంలో తప్పేమిటి అని ప్రశ్నించారు. సముచితమైన తన సలహాలను వక్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ కోవర్టుగా తనకు ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఓ వర్గం మీడియాను కానీ, జనసేన పార్టీలోని కొందరు సలహాదారులను ఏమనాలి అన్నారు. వారిని తెలుగుదేశం కోవర్టులుగా చెప్పాలా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజీ వీరుడిగా వర్ణిస్తూ.. రూ.వెయ్యి కోట్లు అయినా ఈ డీల్‌లో చేతులు మారాయని విమర్శలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. వారి విమర్శలను ఎందుకు తిప్పి కొట్టడం లేదన్నారు. పవన్‌ను ప్యాకేజీ వీరుడుగా జనంలో నమ్మింపచేసి, జనసేన పార్టీని నిర్విర్యం చేసి దాని వల్ల లబ్ధి పొందాలనేది ఈ తెలుగుదేశ అధినేతల కుతంత్రమా అని ప్రశ్నించారు. జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని పవన్ కళ్యాణ్ ప్రవర్తించటం, జనసేన మంచికోరి ఎంతైనా మంచిదన్నారు. పవన్‌కు ఇష్టమైనా, లేకపోయినా.. వెంటే ఉండి ఆయన్ను కాపాడుకోవడమే విధిగా భావిస్తున్నాను అన్నారు.
తాను చచ్చేవరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని.. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఎన్నికలో కలిసే పోటీ చేయాలని.. తద్వారా వైఎస్సార్‌సీపీ నుంచి విముక్తి చేయాలని యజ్ఞంలో జన సైనికులు ఎల్లప్పుడూ పవన్‌తోనే ఉంటారనే విషయంలో సందేహం అవసరం లేదన్నారు. నీతివంతమైన పవన్ కళ్యాణ్ వంటి వారు ముఖ్యమంత్రి అవ్వాలని తనలాంటి వారు కోరుకుంటున్నారన్నారు. దోచుకో దాచుకో పరిపాలన అందిస్తున్ర వైఎస్సార్‌సీపీ పరిపాలనకు ముగింపు పలకాలనే పవన్ లక్ష్యసాధనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కూటమి అధికారంలో వస్తే పవన్‌కు సముచిత స్థానం లభించేవరకు తన పోరాటం ఇలాగే కొనసాగుతుందన్నారు.