శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలని కలెక్టర్ లక్ష్మిశ సూచించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని త్రినేత్ర అతిథి భవనంలో గురువారం పలు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులను గత ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు.ఈ ఏడాది అత్యవసర సేవలపై నిరంతరం అప్రమత్తంగా వుండాలని ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలనకు రెవెన్యూ, ఐసీడీఎస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.ఉత్సవాల సమయంలో ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహించాలని వైద్యశాఖను ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని పురపాలక శాఖను, నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అగ్నిమాపక వాహనం, 108 వాహనం ఆలయం వద్దనే నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై ఎస్పీ మలిక గార్గ్ పలు సూచనలు చేశారు.గత ఏడాది ఉత్సవాల్లో బందోబస్తును పర్యవేక్షించిన సీఐ అంజుయాదవ్ సమావేశానికి హాజరై క్యూలైన్ల విధానం, రద్దీ రోజుల్లో బందోబస్తు నిర్వహణ, రథోత్సవం, తెప్పోత్సవంలో చోరీలు జరగకుండా తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.అవంతా విన్న ఎస్పీ ఈ ఏడాది అమలు చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయంలో తిరిగి కసరత్తు చేశారు.ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, ఆర్డీవో రవిశంకర రెడ్డి, ఈవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు కలెక్టర్, ఎస్పీ ఆలయానికెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.నిత్యాన్నదానంలో కలెక్టర్ భక్తులతో కలిసి భోంచేశారు.