తిరుపతిలో శుక్రవారం సాయంత్రం భారీ బహిరంగసభ నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేపట్టింది. ఎస్వీ యూనివర్శిటీ స్టేడియంలో నేటి సాయంత్రం 4 గంటలకు జరగనున్న బహిరంగసభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల,రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు హాజరు కానున్నారు. దీనికోసం సచిన్ పైలెట్ బెంగుళురు నుంచీ షర్మిల హైదరాబాదు నుంచీ విమానాల్లో తిరుపతి చేరుకోనున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగసభలో నరేంద్ర మోదీ బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో బీజేపీ సభ నిర్వహించిన ఎస్వీయూ స్టేడియంలోనే ఇపుడు కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగసభ ఏర్పాటు చేస్తోంది. అదే చోట సభ జరిపి మోదీ హామీలను ప్రజలకు గుర్తు చేయడంతో పాటు హామీల అమలుపై మోదీని కాంగ్రెస్ నేతలు నిలదీయనున్నారు. వైఎస్ షర్మిల పీసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇదివరకే తిరుపతిలో సమావేశం నిర్వహించినప్పటికీ అది పార్టీ అంతర్గత సమావేశం. బహిరంగసభ జరపడం మాత్రం ఇదే తొలిసారి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తొలి బహిరంగసభ కావడంతో దీన్ని ఎలాగైనా విజయవంతం చేయాలని పార్టీ నాయకులు శ్రమిస్తున్నారు. 30 వేలమందితో సభ జరపాలని, దానికోసం ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా జనసమీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారు. బహిరంగసభా స్థలిలో ఏర్పాట్లను గురువారం పీసీపీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ చింతా మోహన్, పీసీసీ నేత తులసిరెడ్డి తదితరులు పర్యవేక్షించారు.