దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి (మార్చి3) మార్చి 16వ తేదీ వరకూ13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో, రంగవల్లికలతో ఆకర్షణీయంగా సుందరశోభితంగా తీర్చిదిద్దారు. ఆలయంలో వాహనసేవలకు వినియోగించే వాహనాలను శుద్ధి చేసి రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైనది వాహన సేవలే. బ్రహ్మోత్సవాలు నిర్వహించే 13 రోజులు పాటు ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వాహన సేవను నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజున వాహన సేవలను తిలకించి భక్తులు ముక్తి పొందాలని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆలయం లోపల విద్యుత్ దీపాలంకరణలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆలయం అంతా రంగువళికలతో కనువిందు చేసేలా ముస్తాబు చేశారు. ఓవైపు శిల్పకళా సౌందర్యం, మరోవైపు రంగవల్లులతో శోభితం శ్రీ కాళహస్తి ఆలయం శోభాయమానంగా మారింది.
ఘనంగా కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
మరోవైపు తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
ముత్యపు పందిరి వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
మరోవైపు శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.