ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ తొలిసారిగా ఏపీకి వెళ్తున్నారు. మార్చి 11న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. అందులో భాగంగా విశాఖలో సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఇదే సమయంలో మార్చి ఏడో తేదీన గుంటూరులో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరుకానున్నారు.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హస్తం పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకీ దూరమైన వర్గాలను ఆకర్షించే పనిలో పడ్డారు షర్మిల. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేయడమే కాకుండా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు జాతీయ స్థాయి నాయకులు, ఇతర రాష్ట్రాలలోని ముఖ్యనేతలను తీసుకువచ్చి కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ న్యాయసాధన సభ నిర్వహించింది. ఈ సభకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ తొలి గ్యారెంటీని సైతం ప్రకటించింది.
ఇక రేవంత్ రెడ్డిని సైతం ఏపీ ఎన్నికల ప్రచారంలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల ఈ విషయంలో అధిష్ఠానాన్ని కలిసి అభ్యర్థించినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇటీవలే రేవంత్ రెడ్డిని కలిశారు షర్మిల. ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా కోరగా.. ఆయన అంగీకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే విశాఖలో జరిగే కాంగ్రెస్ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మరోవైపు ఏపీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఏ మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి .. పార్టీ మారినప్పటికీ ఆయనపై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. ఇదే సమయంలో వైఎస్ జగన్ మీద మాత్రం సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే కనీసం ఫోన్ చేసి కూడా అభినందించలేదంటూ ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగానూ జగన్ మీద విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించడం మొదలెట్టారు. ఇటీవలే మంత్రి రోజా సైతం రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎంగా అభివర్ణించడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కోపం తెప్పించింది. రోజా వ్యాఖ్యలపై బండ్ల గణేష్ వంటి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా రియాక్టయ్యారు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏపీ పర్యటనకు వెళ్తే.. ఏ పార్టీని టార్గెట్‌గా చేసుకుంటారు.. మాజీ గురువు మీద ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వైసీపీ, టీడీపీ రెండింటిపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీపైనా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏ పార్టీని టార్గెట్ చేస్తారు.. ఎవరిపై విమర్శలు గుప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.