వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో జరిగే `విజన్ విశాఖ సదస్సు`లో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ‘భవిత’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ స్కిల్ క్యాస్కేడింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి బి.సురేష్ కుమార్ పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘భవిత’ను తీర్చిదిద్దినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 152 యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రూ.90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను ముఖ్యమంత్రి వర్చువల్‌గా విశాఖ నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఎంపీల్యాడ్స్ నిధులతో ఒక్కోటి రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లనూ సీఎం ప్రారంభిస్తారు. 2023–24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ప్లేస్‌మెంట్స్ పొందిన 7,110 మంది విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెర్మనీని నిర్వహించనున్నారు.