ఏపీ సమగ్ర శిక్ష పరిధిలో ఆర్ట్, క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లకు తక్షణమే మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్క్, ఆర్ట్ వ్యాయామ ఉపాధ్యాయుల యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సైకం శివకుమారిరెడ్డి, శంకరరావు డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలోని రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం భవనంలో ఆదివారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ హాజరయ్యారు. పదేళ్లుగా రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పాఠశాల విద్యలో విధులు నిర్వహిస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు అరకొర జీతాలతో జీవనాన్ని నెట్టుకొస్తున్నారని వారు అన్నారు. పేరుకే పార్ట్ టైం అయినా ఫుల్‌టైంగా పదేళ్లుగా సేవలు అందిస్తున్నారని వారికి తక్షణమే ప్రభుత్వం మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఎంటీఎస్, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ అమలు చేయాలని, వృత్తి విద్య ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారిని ఒకేషనల్ ఉపాధ్యాయులుగా మార్చాలని డిమాండ్ చేశారు.