పుట్టిన బిడ్డ మొదలుకొని ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలన్న లక్ష్యంతో ఈనెల 4, 5 తేదీల్లో ప్రతి ఇంటినీ సందర్శించి ఏ కారణం చేతనైనా పోలియో చుక్కలు వేయించని చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించినట్టు కలెక్టర్ దిల్లీరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం సివిల్ కోర్టు సమీపంలోని సీవీఆర్ స్కూల్‌లో కేంద్రంలో కలెక్టర్ దిల్లీరావు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 2.48లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందన్నారు. 1008 కేంద్రాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని తెలిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో 35 కేంద్రాలతో పాటు 71 మొబైల్ వాహనాల ద్వారా పోలియో చుక్కలు వేసేందుకు 4244 మంది వ్యాక్సినేటర్స్‌ను నియమించడం జరిగిందన్నారు. 4, 5 తేదీల్లో ప్రతిఇంటికీ పల్స్ పోలియో బృందం సందర్శిస్తుందని, మిగిలిన పిల్లలకు చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎం.సుహాసిని, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమృత, టీబీ కంట్రోల్ అధికారిణి డాక్టర్ ఉషారాణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఇందుమతి, సీఎంహెచ్‌వో డాక్టర్ రత్నావళి, డీపీఎంవో డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.