త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల బందోబస్తుకు పారా మిలటరీ బలగాలు విజయవాడకు చేరుకున్నాయి. సీఐఎ్‌సఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్)కు చెందిన మూడు కంపెనీలు కమిషనరేట్‌కు వచ్చాయి. ఒక్కో కంపెనీలో 92 మంది సిబ్బంది ఉంటారు. చెన్నై సీఐఎ్‌సఎఫ్ బేస్ క్యాంపు నుంచి ఈ బలగాలు వచ్చాయి. ఎంజీ రోడ్డులోని ఏఆర్ గ్రౌండ్స్‌లో ఉన్న సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం అధీనంలో ఈ బలగాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మూడు కంపెనీలు వచ్చినప్పటికీ త్వరలో మరిన్ని కంపెనీలు వస్తాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు, ఈ కంపెనీలతో కలిసి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఎన్టీఆర్ జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించారు. స్టేషన్ల వారీగా ఆయా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌లకు మ్యాప్‌లను సిద్ధం చేశారు. రోజుకు ఒక్కో పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఈ మార్చ్‌లు చేస్తారు. విజయవాడ కొత్తపేట స్టేషన్ పరిధిలో వైఎస్సార్ కాలనీ, పి.నైనవరం, అంబాపురం ప్రాంతాల్లో పశ్చిమ ఏసీపీ పడాల మురళీకృష్ణారెడ్డి, పశ్చిమ జోన్ ఇన్‌స్పెక్టర్ శేఖర్‌రెడ్డి, గణేష్, వి.కృష్ణ, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. తిరువూరు ఏసీపీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో మైలవరంలో ఈ మార్చ్ సాగింది. నందిగామ ఏసీపీ బి.రవికిరణ్, జగ్గయ్యపేట ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ పుల్లా చంద్రశేఖర్ ఈ సీఐఎ్‌సఎఫ్ బలగాలతో జగ్గయ్యపేటలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిటీ డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, రూరల్ డీసీపీ కంచి శ్రీనివాసరావు ఫ్లాగ్‌మార్చ్‌ల్లో పాల్గొన్నారు.