నూజివీడులో 80 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ళను తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు పూర్తిచేసి ప్రజలకు అందిస్తానని, అలా జరగకపోతే లబ్ధిదారులు తన ఇంటిపై రాళ్ళు రువ్వవచ్చని టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. స్థానికుడిని అని చెప్పుకుంటే సరిపోదని, పెనమలూరులోనూ తాను స్థానికుడిని కానని, అయినా అక్కడ ప్రజలు తన పనితీరును చూసి మూడుసార్లు తనను గెలిపించారన్నారు. ఇక్కడ శాసనసభ్యుడు రైతులకు ఆధారమైన చింతలపూడి విషయంలోనూ, టిడ్కో గృహాల విషయంలోనూ కనీసం మాట్లాడలేదని, తాను అధికారంలోకి వచ్చిన తరువాత చింతలపూడిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు టిడ్కో ఇళ్ళను ఆరునెలల్లో పూర్తిచేయడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యలపై దృష్టిసారించి వాటి పరిష్కారం పై దృష్టిపెడతానన్నారు. 2018లో నిధులు మంజూరైన వివిధ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని దీనిపై ఎందుకు నిలిచాయో ఎంక్వైరీ చేస్తే కాంట్రాక్టర్ల నుంచి 20 శాతం కమీషన్లు అడుగుతున్నారని విషయం బయటపడిందన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కుమారుడిపై అనేక ఆరోపణలు విన్నానని, వాటిని తాను అరికడతానన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, నూజివీడు పట్టణ నాయకులు హాజరు అయ్యారు.