రా.. కదలిరా సభలతో జోరుమీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పర్యటించారు. పెనుకొండలో రా.. కదలిరా.. పేరిట బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎవరినీ ఉద్యోగం నుంచి తీసేయమంటూ హామీ ఇచ్చారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న చంద్రబాబు.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే వైసీపీ కోసం మాత్రం పనిచేయకండి అంటూ సూచించారు.
ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ మీద కూడా చంద్రబాబు సెటైర్లు వేశారు. " మేము అధికారంలో ఉన్నప్పుడు ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం. జగన్ ఏమో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ ఐదేళ్లలో వేరే ఉద్యోగాలు వచ్చాయా? టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించం. వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. వైసీపీ కోసం పనిచేయకండి" అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు టీడీపీ, జనసేన పొత్తుపై వస్తున్న విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. స్వార్థం కోసం టీడీపీ- జనసేన కలవలేదన్న చంద్రబాబు.. ఏపీని రక్షించుకునేందుకే తాము పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. కియా పరిశ్రమ ద్వారా వేలమందికి ఉద్యోగాలు కల్పించామన్న చంద్రబాబు.. గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఏడాదిన్నరలోనే పూర్తిచేశామన్నారు. సాగునీరు ఇస్తే రాయలసీమ రైతులు బంగారం పండిస్తారన్న చంద్రబాబు ..అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలని సూచించారు.
ఇక అభివృద్ధి విషయంలో టీడీపీతో వైసీపీని పోల్చవద్దని చంద్రబాబు జగన్‌కు సూచించారు.. రాయలసీమలో కొత్తగా ఏదైనా ప్రాజెక్టు నిర్మించారా అని ప్రశ్నించారు. రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు, కంపెనీల గురించి చెప్పాలని నిలదీశారు. అందుకే అభివృద్ధి విషయంలో టీడీపీతో పోల్చుకోవద్దంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేసే టీడీపీ కావాలో.. స్కీముల్లో కూడా స్కాములు చేసే జగన్ కావాలో తేల్చుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.