ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే అవతలి పార్టీ అభ్యర్థులను అనుసరించి అవసరమైతే ఇంఛార్జులను మార్చేస్తున్నాయి. మరో చోటకు పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురం ఎంపీ అభ్యర్థి విషయంలో వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన ఎమ్మెల్యేను బరిలో దించాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచిన రాపాక వరప్రసాద్ పేరును అమలాపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం అమలాపురం ఎంపీగా చింతా అనురాధ ఉన్నారు. అయితే మరోసారి ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. ఆమె స్థానంలో రాపాక వరప్రసాద్‌ను బరిలో నిలపాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ .. ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికి ఆ పార్టీకి సపోర్టుగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి కూడా రాజోలు నుంచి రాపాక బరిలోకి దిగడం ఖాయమని ఆయన అనుచరులు భావించారు. అయితే ఊహించని విధంగా.. రాజోలు నుంచి కాకుండా రాపాకను అమలాపురం ఎంపీగా బరిలో నిలపాలని వైసీపీ పరిశీలిస్తోంది. అయితే రాజోలు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రాపాక వరప్రసాద్ భావిస్తున్నారట. మరి ఏమవుతుందోనేదీ కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.
ఇదే సమయంలో టీడీపీలోనూ అమలాపురం ఎంపీ టికెట్ గురించి గట్టిపోటీ నడుస్తోంది. లోక్‌సభ మాజీ స్పీకర్, దివంగత నేత బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ అమలాపురం ఎంపీ సీటును ఆశిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అమలాపురం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన హరీష్ మాథుర్.. ఓటమిపాలయ్యారు. మరోసారి అక్కడి నుంచే బరిలో నిలవాలని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ బుచ్చిబాబు కుమార్తె సత్యశ్రీ సైతం ఈ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. సత్య శ్రీ ఇటీవలే టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో టీడీపీలో అమలాపురం ఎంపీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం కత్తిమీద సాముగా మారింది.