తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఓ డ్రోన్ కెమెరా కలకంరేపింది. తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులు డ్రోన్ కెమెరాతో వీడియోలను చిత్రీకరించారు. వీరిని ఆలయ సెక్యూరిటీ గుర్తించి పోలీసులకు అప్పగించారు. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్ కన్నన్, శంకర్ శర్మ, అరవింద్, పోర్చే జీఎన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని శనివారం రాత్రి శ్రీకాళహస్తి వచ్చారు. ముక్కంటి ఆలయానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో గది అద్దెకు తీసుకున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కావడంతో ఆలయ పరిసరాలకు విద్యుత్ దీపాలంకరణ చేశారు. వీటిన్నింటినీ చిత్రీకరించాలని ఆ యువకులు భావించారు. తాముంటున్న గెస్ట్‌హౌస్ పైనుంచి డ్రోన్ కెమెరాతో అర్ధరాత్రి ప్రధాన ఆలయంలో చిత్రీకరించారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత డ్రోన్‌ను వెంబడించి యువకులను గుర్తించారు. శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు.
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంగా భక్తకన్నప్ప కొండపై ఆయన నేతృత్వంలో కైలాసనాథుని ఆలయం వద్ద ధ్వజారోహణ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. ఓంనమఃశివాయ నామస్మరణల మధ్య దవళవస్త్రాన్ని అర్చక స్వాములు ధ్వజస్తంభం మీదకు అధిరోహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య దీక్షా గురుకుల్ వరద గురుకుల్, ఆలయ ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ నేతృత్వంలో సంకల్ప పూజలు ప్రారంభించారు. ఘనంగా ధ్వజారోహణ ఘట్టాన్ని జరిపారు.
14 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు క్షేత్ర సంప్రదాయం ప్రకారం పరమశివుడి భక్తుడైన కన్నప్పకే తొలి పూజ చేశారు. ముక్కంటి ఆలయంలోని అలంకార మండపం నుంచి భక్తకన్నప్ప ఉత్సవ మూర్తిని కొండపైకి ఊరేగించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ వేదోక్తంగా కన్నప్ప ధ్వజారోహణం చేశారు. శివయ్య బ్రహ్మోత్సవాలకు భక్తులందరినీ ఆహ్వానించేలా భక్తకన్నప్ప ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు.
![]() |
![]() |