అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో భారత సంతతి మహిళ నిక్కీ హేలీ తొలి విజయం అందుకున్నారు. ఈ రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తుండటంతో ఆమెకు దక్కిన విజయం ఊరటనిచ్చినట్టయ్యింది. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో హోలీ విజయం సాధించినా.. శనివారం నాడు మూడు రాష్ట్రాల్లో జరిగిన పార్టీ అభ్యర్థిత్వం ఎన్నికల్లో ఆమె వెనుకబడ్డారు. మిసోరి, మిచిగన్, ఐడహో కాకస్‌ల్లో ట్రంప్ హవా కొనసాగింది. దాదాపు అందుబాటులోని ప్రతినిధులనందరినీ ఆయన సొంతం చేసుకున్నారు. మరో 15 రాష్ట్రాల్లో మంగళవారం ఓటింగ్ జరగనుండగా.. హేలీ ముందుగానే తప్పుకోవడం గమనార్హం.
వాషింగ్టన్‌లోని మొత్తం 22 వేల ఓట్లలో 60 శాతం హేలీకి ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీచేసిన జో బైడెన్‌కు ఇక్కడ 92 శాతం ఓట్లు రావడం విశేషం. దీనిపై హేలీ టీం ఓ ప్రకటన చేస్తూ.. ‘వాషింగ్టన్‌లో రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్, అతడి గందరగోళాన్ని తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదు’ అని పేర్కొంది. దీనికి ట్రంప్ బృందం ‘నిక్కీ హేలీని స్వాంప్ రాణిగా అభివర్ణిస్తూ’ ప్రకటన విడుదల చేసింది.
‘వాషింగ్టన్ డీసీలో ఈ రాత్రి ఫలితాలు అధ్యక్షుడు ట్రంప్ ప్రచారం లక్ష్యాన్ని పునరుద్ఘాటించాయి.. వలసను నిరోధించడం, అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడం’ అని ప్రకటన పేర్కొంది. వర్జీనియాలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను రాకెట్ వేగంతో దూసుకుపోతున్నానని తెలిపారు. ట్రంప్ నెగ్గిన ప్రతినిధుల సంఖ్య 244కు చేరుకుంది. హేలీ ఖాతాలో 24 మంది మాత్రమే ఉన్నారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలవాలంటే, 1215 మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం ట్రంప్ దూకుడు చూస్తుంటే ఈ సంఖ్యను ఆయన మంగళవారం జరిగే 15 రాష్ట్రాల ప్రైమరీల్లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.