మావోయిస్ట్‌లతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అరెస్టై జీవిత ఖైదుపడిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఆయన నివాసంలో మావోయిస్టు సాహిత్యం లభ్యమైనట్టు ఆరోపించారు. గడ్చిరోలి సెషన్స్ కోర్టులో ఆయనకు 2017లో దోషిగా నిర్దారిస్తూ జీవిత ఖైదు విధించింది.
అనారోగ్యంతో వీల్ చెయిర్‌కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పును ఆయన బాంబే హైకోర్టులో సవాల్ చేయగా.. కింది కోర్టు తీర్పును రద్దు చేసింది. 2022 అక్టోబర్ 14న ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. మరోసారి విచారణ జరపాలని హైకోర్టుకు సూచించింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు డివిజన్ బెంజ్ విచారణ చేపట్టింది. జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెనెజెస్‌ల ధర్మాసనం ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
ప్రాసిక్యూషన్ సహేతుకమైన సందేహానికి మించి కేసును నిరూపించలేకపోయినందున నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అంతేకాదు, నిందుతుడిపై ఉపా చట్టంలోని సెక్షన్ల కింద పెట్టిన కేసులను రద్దుచేసింది. రూ.50 వేల పూచీకత్తుపై నిందితుల్ని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో మహారాష్ట్ర సర్కారు మళ్లీ సుప్రీంను ఆశ్రయించనుంది.