ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా చైనా జెండాతో తమిళనాడు ప్రభుత్వం ముద్రించిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా, డీఎంకే నేతల అత్యుత్సాహం కారణంగా సీఎం స్టాలిన్ ఇరుకునపడ్డారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను '‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు (తమిళనాడు పెళ్లికూతురు)'గా పేర్కొంటూ ఆయన ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతోన్న వీడియోలో ముఖ్యమంత్రి ఫోటో వెనుక 'బ్రైడ్ ఆఫ్ తమిళనాడు' అని రాసి ఉంది. బ్యానర్‌పై 'ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అని ముద్రించాల్సి ఉండగా.. తప్పుగా ప్రింట్ అయ్యింది. ప్రింట్ తర్వాత అది కాస్తా ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’గా మారిపోయింది.
ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఈ బ్యానర్ డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు సందర్భంగా వేయించారు. చోషింగనల్లూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే యువత తరపున 576 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అందుకోసం ముద్రించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్‌లో మార్చి 1 న గౌరవనీయులైన ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా చోళింగనల్లూర్ తూర్పు యువత తరఫున 576 మందికి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోటో వెనుక ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అని తప్పుగా పేర్కొన్నారు. బ్రైడ్ అంటే వధువు. మరి సీఎం స్టాలిన్‌ను తమిళనాడు పెళ్లికూతురు అంటూ పోస్టర్ వేయడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘తమిళనాడులో నమ్మశక్యం కాని విధంగా ఆంగ్లం పరిజ్ఞానం ఉంది’ అని నెటిజన్.. మరొకరు "వరుడు ఎవరు?" అని వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు.