భర్తను వదిలేసి ప్రియుడి కోసం తన పిల్లలతో కలిసి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆమె భర్త గులాం హైదర్.. పరువు నష్టం కేసు వేశారు. సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనాలపై రూ.3 కోట్లకు పరువు నష్టం వేస్తూ ఈ మేరకు గులాం హైదర్ తరఫు న్యాయవాది మోమిన్ మాలిక్ నోటీసులు పంపారు. అలాగే సీమా తరఫున లాయర్ డాక్టర్ ఏపీ సింగ్‌కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపడం గమనార్హం. ఈ ముగ్గురికీ పరువు నష్టం నోటీసులు పంపిన గులాం.. వారంతా నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పి, జరిమానా కట్టకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాకిస్థాన్‌లో ఉన్న సీమా భర్త గులాం హైదర్.. ఇటీవల హరియాణాలోని పానిపట్‌కు చెందిన సీనియర్ లాయర్ మోమిన్ మాలిక్‌ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. ఇటీవల మోమిన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీమా హైదర్‌ను అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న అన్ని పత్రాల్లోనూ భర్త పేరు గులాం హైదర్ అని రాసి ఉంది.. కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసినప్పుడు సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని పేర్కొన్నారు.. ఈ విధంగా ఆమె తాను గులాం హైదర్ భార్యనని ప్రకటించుకుంది.. కానీ, సీమా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఇంకా ఆమె సచిన్ భార్య అని ఏ ప్రాతిపదికన చెబుతున్నారు’ అని ప్రశ్నించారు.
ఈ కారణంగానే పాకిస్థాన్‌లో సీమా హైదర్ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారని మోమిన్ మాలిక్ వెల్లడించారు. తాను సీమా హైదర్ నుంచి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని గులాం తన నోటీసుల్లో పేర్కొన్నారు. సచిన్ కారణంగానే నలుగురు పిల్లలు తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆయన ఆరోపించారు. సచిన్ మీనాతో సీమా హైదర్‌కు ఆన్‌లైన్ గేమ్ పబ్జీలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ నేపాల్‌లో గతేడాది మార్చిలో తొలిసారి కలుసుకుని అక్కడ వివాహం చేసుకున్నారు. అనంతరం పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన సీమా.. తిరిగి తన పిల్లలను తీసుకుని అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. మే 10న ఆమె కరాచీ నుంచి దుబాయ్ మీదుగా నేపాల్‌కు చేరుకుని.. అక్కడ నుంచి పోఖ్రాన్ నుంచి భారత్‌లో అడుగుపెట్టింది. ఈ ఘటన భారత్‌తో పాటు పాకిస్థాన్‌లో కలకలం సృష్టించింది.