రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి మరణశాసనమని ఏపీసీసీ మీడియా ఛైర్మెన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రక తప్పిదమన్నారు. ఏ ప్రాంతం వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తే, ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతి మయం, మాఫియా మయం అవుతుందని.. కాబట్టి తరలించ వద్దన్నారు. దీనికి బదులు ఉత్తరాంధ్ర సృజల స్రవంతిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ మెట్రో, రైల్వేజోన్ తెప్పించాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేయవద్దని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారన్నారు. రాజధాని తరలింపు జోలికి పోకుండా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయండని గోదావరి జిల్లా ప్రజలు అడుగుతున్నారన్నారు. ఉన్న రాజధానిని తరలించడం ఎందుకు? అని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. రాజధానిని మరింత దూరభారం చేస్తారని నెల్లూరు, రాయలసీమ ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ‘‘ఒక రాజాధానికి దిక్కూలేదు.. మూడు రాజధానులటా! జగన్ మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్’’ అంటూ తులసిరెడ్డి దుయ్యబట్టారు.