అకస్మాత్తుగా చిరుతపులి కనిపిస్తే..? కాళ్లూ, చేతులు వణికిపోతాయి. గుండె ఆగినంత పనవుతుంది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో ఓ గదిలోకి ఇలాగే చిరుతపులి ప్రవేశించింది. ఆ సమయంలో ఓ బాలుడు సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ పరధ్యానంగా ఉన్నాడు. గదిలో అతడు తప్ప మరెవ్వరూ లేరు. చిరుతపులిని చూడగానే ఆందోళన కలిగినా అతడు మాత్రం కంగారు పడలేదు. సైలెంట్‌గా గది తలుపు మూసి, గడియపెట్టి చిరుతను బంధించాడు. ఆ వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో బాలుడు ప్రదర్శించిన ధైర్యం, తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్‌లో మంగళవారం (మార్చి 5)న చోటుచేసుకుంది. మాలెగావ్ శివార్లలో నాంపూర్ రోడ్డులో ‘సాయి సెలబ్రేషన్ వెడ్డింగ్ హాల్’ ఉంది. ఈ ఫంక్షన్ హాల్‌లో విజయ్ అహిరే అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం అతడు తన కుమారుడిని ఫంక్షన్ హాల్ బుకింగ్ ఆఫీస్‌లో కూర్చోబెట్టి పని మీద బయటకి వెళ్లిపోయాడు. 12 ఏళ్ల బాలుడు మోహిత్ విజయ్ అహిరే అక్కడి సోఫాలో కూర్చొని స్మార్ట్‌ఫోన్‌లో గేమ్ ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక చిరుతపులి గది లోపలికి ప్రవేశించింది.
తలుపు వద్దే సోఫాలో కూర్చొని ఉన్న మోహిత్‌ను దాటుకుంటూ ఆ చిరుతపులి నేరుగా ఆఫీసు లోపల ఉన్న మరో గది లోపలికి వెళ్లింది. సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో పిల్లలు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టే అవకాశం ఉంది. కానీ, మోహిత్ తెలివిగా ఆలోచించాడు. చడీ చప్పుడు లేకుండా బయటికి వెళ్లి, తలుపు వేసేశాడు.
చిరుతపులి ఆఫీసులోకి దూరిన విషయాన్ని మోహిత్ వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి తెలిపాడు. ఆ తర్వాత అటవీ శాఖ, పోలీసు శాఖకు సమాచారం అందింది. అయితే, జనావాసాల్లోకి చిరుతపులి వచ్చిందని అప్పటికే అధికారులకు సమాచారం అందడంతో స్థానికులు, పోలీసులు, అటవీ శాఖ అధికారులు గాలింపు చేపట్టారు. ఇంతలో ఫంక్షన్ హాల్ నిర్వాహకుల నుంచి ఫోన్ రావడంతో క్షణాల్లో అక్కడికి వచ్చేశారు.
పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది కలిసి గదిలో ఉన్న చిరుతపులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. అయితే, చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. ఆఫీసు వెనక వైపు ఉన్న కిటికీ అద్దాన్ని పగులగొట్టి.. గన్ సాయంతో ఆ కిటికీలో నుంచి చిరుతకు మత్తు సూది ఇచ్చారు. ఆ తర్వాత మత్తులోకి జారుకున్న చిరుతను బంధించి వ్యానులో తీసుకెళ్లారు.
చిరుత ఆఫీసులోకి ప్రవేశించిన వెంటనే బాలుడు మోహిత్ తలుపు వేసి, లాక్ చేసిన ఘటన అక్కడ అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 12 ఏళ్ల వయసులో బాలుడు ప్రదర్శించిన ధైర్య సాహసాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.