చైనాకు దగ్గరవుతోన్న మాల్దీవులు.. భారత్ వ్యతిరేక వైఖరిని మరింత అవలంభిస్తోంది. ఇప్పటికే తమ భూభాగం నుంచి భారత సైన్యాలను వెనక్కి పంపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా, భారత్‌కు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. భారత్ అందజేసిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం గురువారం ప్రకటించింది. భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని ఎంఎన్‌డీఎఫ్‌లోని ప్లాన్స్, పాలసీ, రిసోర్సెస్ విభాగం డైరెక్టర్ కర్నల్ అహ్మద్ ముజుథబ మహమ్మద్ తెలిపారు.
మే 10 తర్వాత మాల్దీవుల భూభాగంపై విదేశీ దళాలను వెనక్కి తీసుకోవాలని అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు ఆదేశించినట్లు ఆయన గుర్తుచేశారు. మరోవైపు, మాల్దీవులకు అందజేసిన హెలికాప్టర్‌ను నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది స్థానంలో సాధారణ పౌర నిపుణుల బృందాన్ని పంపినట్లు గతవారం భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ను నిర్వహించే సాంకేతిక సిబ్బంది మొదటి బృందం మాల్దీవులకు చేరుకుంది.. ఈ ప్లాట్‌ఫారమ్‌ను నిర్వహిస్తున్న ప్రస్తుత సిబ్బందిని ఇది భర్తీ చేస్తుంది’ అని ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
గతేడాది జరిగిన ఎన్నికల్లో భారత్ అనుకూల మహమ్మద్ సోలీ ఓటమి పాలయ్యారు. విజయం సాధించిన చైనా అనుకూల మొయిజ్జు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భారత దళాలు తమ భూభాగం నుంచి వైదొలగాలని అధికారం చేపట్టిన వెంటనే చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. మరోవైపు, భారత్‌తో కుదుర్చుకున్న 100 ఒప్పందాలను సమీక్షిస్తామని ఇటీవలే ప్రకటించారు. సముద్రగర్భ సర్వేల నిర్వహణకు గతంలో భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించబోవడం లేదని పేర్కొన్నారు.
చైనాకు దగ్గరయ్యే క్రమంలో డ్రాగన్‌తో వివిధ ఒప్పందాలకు సిద్ధమయ్యారు. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే వంటి సాధారణ ఆయుధాలను చైనా ఉచితంగా అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ దేశ సైనికులకు శిక్షణ కూడా ఇస్తుందని స్వయంగా మొయిజ్జు ప్రకటించారు. మరోవైపు, రాజధాని మాలె సమీప జలాల్లో చైనా పరిశోధన నౌక వారం రోజులపాటు సంచరించింది. మే 10 నాటికి భారత దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని మొయిజ్జు స్పష్టం చేశారు. ఇక, భారత సైన్యం ఉపసంహరణ, సాంకేతిక బృందాన్ని మాల్దీవులకు పంపడానికి సంబంధించి గడువు నిర్ణయించిన మాల్దీవుల అధ్యక్షుడు, చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మొయిజ్జు మాట్లాడుతూ.. మాల్దీవులు, చైనాల మధ్య సైనిక సహకారం ఎల్లప్పుడూ ఉందని, ఈ ఒప్పందం మాల్దీవులకు సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కావడానికి సాయపడుతుందని అన్నారు.