సార్వత్రిక ఎన్నికలకు మార్చిన 13న షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన పనులు, శంకుస్థాపనలు, భవనాల ప్రారంభోత్సవాలను వెంటనే పూర్తిచేయాలని క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశిస్తున్నారు. వాస్తవానికి కిందటి సారి షెడ్యూల్ 2019 మార్చి 10న వెలువడగా.. అదే నెల 18న నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఏప్రిల్ 11న జరిగిన తొలి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. తెలంగాణలోని లోక్‌సభ, ఏపీలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ చేపట్టారు.
అయితే, ఈసారి మార్చిన 13న షెడ్యూల్ వస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి బలం చేకూరేలా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ఇటు, ప్రధాని మోదీ కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పలు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సభలు 13న ముగియనున్నాయి. అదేరోజు సాయంత్రం లేదంటే మర్నాడు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఇప్పటికే సమాయత్తమవుతున్నాయి. షెడ్యూల్ జారీతో దేశమంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.
మార్చి 14 నుంచి కోడ్ అమల్లోకి రానుంది. ఈసారి కూడా ఎన్నికలను ఏడు దశల్లోనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. ఎన్నికల ర్యాలీలో రాజకీయ పార్టీలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలవుతుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఇతర రాజకీయ పార్టీలపై ఏవైనా విమర్శలు చేసినప్పుడు, వారి విధానాలు, కార్యక్రమం, గత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటారు.
ఎన్నికల అంచనాల కోసం ఈసీ అధికారులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ అంచనాలను మార్చి 13 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీని తర్వాత జాతీయ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిమ్ శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి.