ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడపిల్లను చంపడమంటే వెయ్యిమంది సాధువులను చంపడంతో సమానం.. శ్రీశ్రీ రవిశంకర్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2024, 11:21 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ సందేశాన్ని ఇచ్చారు. భారతీయ సమాజం స్త్రీకి ఎంతో గౌరవం, సముచిత స్థానం ఇచ్చిందని అన్నారు. ఈ సృష్టికి మూలం స్త్రీ శక్తి అని.. మన నాగరికత మొత్తం దానిపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు.‘‘భారతీయ ధర్మశాస్త్రాలు స్త్రీకి అపారమైన శక్తిని, గౌరవాన్ని ఇచ్చాయి... స్త్రీ, పురుషులిరువురూ సమాన భాగస్వాములని మనదేశం ఎల్లప్పుడూ నమ్మూతూ వచ్చింది.. దేవుడు కేవలం పురుషుడు లేదా స్త్రీ మాత్రమే కాదని.. ‘అర్ధనారీశ్వర’ భావన మనకు ఉంది. నిజం చెప్పాలంటే ఈ సృష్టి అంతటికీ మూలమైన ప్రాణశక్తి – దాన్నే మనం శక్తి అని పిలుస్తాం.. ఆ శక్తి స్త్రీ శక్తి. 'సాంబసదాశివ' అని శివుడిని మనం కొలుస్తాం. శివతత్వం అనేది శివ, అంబ అనే పురుష, స్త్రీ శక్తులు రెండింటినీ కలిగి ఉంటంది. పార్వతి శివునికంటే వేరు కాదు.. పార్వతి అనేది ఆనందకరమైన ఉత్సవం నుంచి పుట్టింది. శివతత్వం లేకుండా అనందమనేది ఉండదు.


శివుడిని, శక్తిని ఒకక క్షణంపాటైనా విడదీయడం అసాధ్యం. శివుడు సన్యాసి అయినప్పుడు, (అంతటా వ్యాపించి ఉన్నప్పుడు), శక్తి అనేది ఆ పరిధికి మించి ఎలా ఉండగలదు? అందుకే మన గ్రంధాలు స్త్రీలను దైవత్వం అత్యున్నత అంశంగా - ఆదిశక్తిగా గౌరవించాయి. ప్రాచీన భారతదేశంలో చాలాకాలం పాటు, స్త్రీలు సైతం యజ్ఞోపవీతం (జంధ్యం) ధరించేవారు. పార్వతీదేవి, గార్గి మొదలైన దేవతలు సైతం యజ్ఞోపవీతం ధరించినట్టు కనబడుతుంది. మన పురాణేతిహాసాలలో సైతం ఈ విషయం ఉంది. మన నాగరికత మొత్తం స్త్రీ శక్తిపైనే ఆధారపడి ఉంది. అందుకే ఆమెను భరతమాత అని మనం పిలుచుకుంటాం. మన దేశమే స్త్రీ స్వరూపంగా భావించి, ఆ విధంగానే ఆరాధిస్తున్నాం.


మనం స్త్రీలను తప్పక గౌరవించాలి. ఆడపిల్లను చంపడం వెయ్యి మంది సాధువులను చంపడంతో సమానమని మన గ్రంథాలు చెబుతున్నాయి. స్త్రీయే మనల్ని ఈ భూగోళం పైకి తీసుకువచ్చేది. తల్లి మనకు మొదటి గురువు. మన మొదటి ఒజ్జ. పిల్లల్లో, కుటుంబంలో, సమాజంలో విలువలను పొంపందించేది మహిళలే. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యత కీలకమైంది. సమాజం పటిష్టంగా, సామరస్యపూర్వకంగా ఉందా లేదా అనేది నిర్ణయించేందుకు సమాజంలోని మహిళల పాత్రే ఏకైక ప్రమాణం. అంతే కాదు, మహిళలకు సముచితమైన గౌరవం, ప్రాధ్యానత, ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే అవినీతి రహిత సమాజం ఆవిర్భవిస్తుంది.


మహిళలు జన్మతః నాయకులు, బహుముఖ ప్రజ్ఞాశీలురు, బహుముఖ ప్రతిభావంతులు. వారిలోని ఈ సహజసిద్ధమైన గుణాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మహిళలలో భావావేశాలు ఎక్కువని అనుకుంటారు.. కాని వారు గొప్ప మేధావులు. ఏ విషయంలోనైనా సరే ప్రణాళికలు వేయడంలో, వాటిని అమలుచేయడంలో సిద్ధహస్తులు. ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లో సైతం వస్తున్నందున వారు తమ సహజమైన దయ, కరుణ చూపడం ద్వారా ప్రజల అవసరాల పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. ఇది స్వాగతించదగిన పరిణామం.


ఈనాటి వేగవంతమైన జీవితంలో, మహిళలు తమ అంతర్గత శాంతిని, సౌందర్యాన్ని, నైతిక విలువలను, బయటి ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను సమతౌల్యం చేసుకోవాలి. ఈ సామర్యం స్త్రీలలో సహజంగానే ఉంటుంది. స్త్రీకి ఉండే భావోద్వేగాలు, అంతర్గతమైన ఉత్సాహం, స్ఫూర్తి, ప్రేరణలే ఆమెకు ఉన్న గొప్ప బలం. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో మహిళలు కీలకపాత్ర పోషించాల్సి ఉంది. వారు (సంఘర్షణలలో) మరింత ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించగలరు. ఆపుడు ప్రపంచంలో ఘర్షణలు, దురాశ, అవినీతి తగ్గుతాయి. ప్రజలలో సామరస్యాన్ని పెంచి, వారి జీవితాలకు మార్గనిర్దేశనం చేసి, వారిని ఏకతాటిపై నడిపే మహిళా నాయకత్వం లేకపోవడం వల్లే ఈ రోజు ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువ జరుగుతున్నాయి. యుద్ధాలతో ఛిద్రమవుతోన్న ఈనాటి ప్రపంచంలో, మహిళలు తాము ఒత్తిడికి లోనుకాకుండా చూసుకుంటూనే, సమాజంలో ముందుకు వచ్చి మరింత బాధ్యత చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏ సమాజానికైనా స్త్రీలే వెన్నెముక. పురుషులు పోరాడేందుకు ప్రేరేపించగలరు - మహిళలు ఏకం చేసేందుకు స్ఫూర్తినిస్తారు.’’ అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com