మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల్లో ఒక్కరైన నళిని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త మురుగన్ యూకే వెళ్లడానికి పాస్‌పోర్టు ఇంటర్వ్యూకు అనుమతించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఆమె కోరారు. ప్రస్తుతం నళిని కుమార్తె యూకేలో ఉండగా.. ఆమె వద్దకు వెళ్లాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు మొత్తం ఏడుగుర్ని విడుదల చేయగా, తన భర్త మురుగన్ శ్రీలంక పౌరుడు కావడంతో తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారని నళిని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 12, 2022న నళిని, మురుగన్‌లు జైలు నుంచి విడుదలయ్యారు.
లండన్‌లో నివసిస్తున్న తన కుమార్తెతో కలిసి జీవించాలనుకుంటున్నందున, తాను, తన భర్త అన్ని దేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నామని, జనవరి 30న ఇంటర్వ్యూకి పిలిచారని ఆమె పేర్కొంది. తన ఇంటర్వ్యూ పూర్తయిందని, అయితే శ్రీలంక కాన్సులేట్ పిలిచినప్పుడు తన భర్త ఇంటర్వ్యూకు హాజరు కాలేదని ఆమె తెలిపారు. తిరుచ్చి ప్రత్యేక శిబిరంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, నెల రోజుల్లోనే అక్కడ ఇద్దరు చనిపోయారని అన్నారు. యూకేలోని తన కుమార్తె వద్దకు వెళ్లాలనుకుంటున్నామని, ఈలోగా తన భర్తకు ఏదైనా జరగొచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది.
కాబట్టి, తన భర్త చెన్నైలోని శ్రీలంక కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకి అనుమతించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని, అవసరమైతే తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఎస్ రమేష్, సుందర్ మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ సుందర్ మోహన్ ప్రకటించారు. తదనంతరం, నళిని కేసును మరొక సెషన్‌లో జాబితా చేయడానికి ప్రధాన న్యాయమూర్తి ఆమోదం పొందాలని రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశించింది.
నవంబరు 2022లో విడుదలైనప్పుడు నళిని మాట్లాడుతూ ‘గత 32 సంవత్సరాలుగా నాకు మద్దతుగా నిలిచిన తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు.’ అని చెప్పారు. ఈ కేసులో నళిని శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్‌తో సహా మొత్తం ఆరుగురు దోషులను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆదేశాల మేరకు దేశంలోనే అత్యధిక కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ నళిని వెల్లూరు జైలు నుంచి విడుదలైంది.