విశాఖ రామానాయుడు స్టూడియోపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్టూడియో భూముల అమ్మకాలపై సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. విచారణలో భాగంగా స్టూడియో భూముల అమ్మకాలపై పలు అంశాలను కోర్టు దృష్టికి పిటీషనర్లు తీసుకువచ్చారు. వాదనలు విన్న అనంతరం స్టూడియో భూముల అమ్మకాలపై స్టేను పొడిగించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూముల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలపై గతంలో సుప్రీం స్టే విధించింది. రామానాయుడు స్టూడియో భూములపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానమిచ్చేందుకు సమయం కావాలని పిటీషనర్ వెలగపూడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతవరకూ గతంలో ఇచ్చిన స్టేని కొనసాగించాలని కూడా పిటీషనర్ వెలగపూడి కోరారు. వెలగపూడి అభ్యర్థనను జస్టిస్ అభయ్ఓకా నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. దాంతో తదుపరి విచారణను 6 వారాలకు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.