ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కీలక సమావేశం కొనసాగుతోంది. పొత్తు కుదిరిన నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కీలక చర్చలు జరుపుతున్నాయి. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై పార్టీలు ప్రధానంగా దృష్టిసారించాయి. టీడీపీ బాస్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున గజేంద్ర సింగ్ షెకావత్, జయంత్ పాండే ఈ భేటీలో పాల్గొన్నారు. బీజేపీ, జనసేన పార్టీలు రాష్ట్రంలోని 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడం ఖరారైన నేపథ్యంలో ఏయే పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేదానిపై నేతలు చర్చిస్తున్నారు. కాగా జనసేన ఇప్పటికే 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేసింది. కాగా నేడు (సోమ), రేపు (మంగళ) సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ఈ దిశకు మూడు పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి.