వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై ఫేక్ పోస్ట్ పెట్టారని మోపిన కేసుపై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. తాను ఈ పోస్ట్ పెట్టలేదని కావాలని ఎవరో పోస్ట్ పెట్టారని వర్రా రవీంద్ర రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వైజాగ్‌కు చెందిన టీడీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లు ఉదయ భూషణ్, ఆయన కుమారుడు చంద్ర కిరణ్ భూషణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువురిని అరెస్ట్ చేసి పులివెందుల తీసుకువెళ్లారు. అక్కడ సీఆర్పీసీలోని 41ఏ కింద పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో వీరు ఇరువురికి బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. ఈరోజు (సోమవారం) విచారణకు రాగా.. న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఇరువురిని పులివెందుల పోలీసుస్టేషన్‌లో వర్ర రవీంద్ర రెడ్డి వచ్చి బెదిరించారని న్యాయవాది కోర్ట్‌కు చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కూడా ఉమేష్ చంద్ర చెప్పుకొచ్చారు. తండ్రి ఉదయ్ భూషణ్‌కు ఇప్పటికే 41ఏ కింద నోటీస్ ఇచ్చినా రెండవసారి హాజరుకాలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. స్టేషన్‌కు వెళితే ఫిర్యాదుదారుడు వచ్చి బెదిరిస్తుంటే ఎలా వెళ్తారని ఉమేష్ చంద్ర ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు కాపీని కోర్ట్‌కు ఇవ్వాలని న్యాయమూర్తి కోరారు. మరోవైపు కుమారుడు చంద్రభూషన్‌కు సీఆర్పీసీలోని 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్ట్ వాయిదా వేసింది.