భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే ప్రధాని మోదీ కల అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఏపీలో రూ.29,395 కోట్లతో నిర్మించిన 1134 కిలో మీటర్ల నేషనల్ హైవేలను వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ సోమవారం నాడు ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ చీఫ్ పురంధేశ్వరి, సత్యకుమార్, సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. ఏపీలో రోడ్లు వేయడం వలన ఆర్ధికాభివృద్ధికి ఎంతో దోహద పడుతుందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అభివృద్ధిలో 11 నుంచి 5వ స్థానానికి ఎదిగామన్నారు. అందరిని ప్రగతి పథంలో నడిపిస్తూ.. భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. రోడ్డు మార్గం, రైలు మార్గం, విమాన మార్గాలు అభివృద్ధి జరిగితే దేశం ఆభివృద్ధి జరుగుతుందన్నారు. 2014 ముందు రోజుకు 13 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేవారని.. ఇప్పుడు రోడ్లు వేయడంలో వేగం పెరిగిందన్నారు. దేశ అభివృద్ధి అనేది నరేంద్ర మోదీతోనే సాధ్యమని పురందేశ్వరి స్పష్టం చేశారు.