ఏపీ బీజేపీ కీలక నేత సీఎం రమేశ్ మనసులో మాటను బయటపెట్టారు. తాను విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీ అధిష్ఠానానికి తన ప్రతిపాదనను విన్నవించానని, సమీకరణాలు బట్టి సాధ్యం కాకుంటే పార్టీ ఎక్కడ ఆదేశించినా పోటీకి సిద్ధమని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. ప్రధాని మోదీ పాలన ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. మోదీ సారధ్యంలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. నిన్న (ఆదివారం) ‘సిద్ధం’ సభలో కూడా జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని సీఎం రమేశ్ విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని అసత్యాలు ప్రచారం చేయడం బాగా నేర్చుకున్నాడని మండిపడ్డారు. అవాస్తవాలను వాస్తవాలుగా చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని సీఎం రమేశ్ దీమా వ్యక్తం చేశారు. కూటమి విజయంతో ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.