బాపట్ల జిల్లా, మేదరమెట్లలో జగన్ ‘సిద్ధం’ 4వ సభకు 15 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకున్న సభ అభాసుపాలైందని.. సిద్ధం సభను ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మయసభలా మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఈ సందర్బంగా సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన సీఎం జగన్.. ఈ సభలో ఓటమిని అంగీకరించి ముందస్తు సంతకం చేశారన్నారు. ఉమ్మారెడ్డి తయారు చేసిన మేనిఫెస్టోను విసిరికొట్టి.. సభలో ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ప్రధాన హామీలు అమలు చేయకపోగా.. 95 శాతం అమలు చేశామనడం శుద్ద అబద్ధమని అన్నారు. మద్యపాన నిషేధం అమలు చేసిన తరువాతనే ఓట్లు అడగడానికి వస్తానన్న హామీ ఏమైందని వర్ల రామయ్య నిలదీశారు. సింహం ఒంటరిగానే వస్తుందని బీరాలు పలికిన ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు కూటమిని చూసి ఎందుకు భయపడుతున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తప్పక అధికారంలోకి వస్తుందని.. వాలంటీర్ల సేవలు ఇంకా మెరుగైన రీతిలో ప్రజలకు అందేలా చేస్తామని అన్నారు. ఆర్థిక పరిపుష్టిని ఏ విధంగా మదింపు చేస్తారో చంద్రబాబుకు బాగా తెలుసునని.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడ చంద్రబాబు రద్దు చేయరని, మెరుగైన రీతిలో అమలు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు 2014-19 హయాంలో ఏటా రూ.65 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేసింది వాస్తవం కాదా? అని వర్ల రామయ్య అన్నారు. చంద్రబాబు ఎన్డీయేలో చేరడం కేంద్ర సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించడానికేనని అన్నారు. కందుకూరు సభలో తొక్కిసలాటలో నలుగురు చనిపోతే ఇద్దరు టీడీపీ నాయకులను అరెస్టు చేశారని, మరి నిన్న సిద్ధం సభలో ఇద్దరు చనిపోయారు, ఇంకొకరు చావు బతుకుల్లో ఉన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని కోణాల నుంచి లోతుగా పరిశీలించి చంద్రబాబు హామీలిచ్చారని.. అవన్నీ తప్పక అమలు చేస్తారని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.