మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లవద్దనీ, ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. అలాగే రెండు లక్షల విలువైన ష్యూరిటీ సమర్పించాలని తెలంగాణ హైకోర్టు తీర్పులో పేర్కొంది. వివేకా హత్య కేసు విషయమై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. పాస్ పోర్టును సైతం కోర్టుకు సమర్పించాలని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఆదేశించింది.
మరోవైపు వివేకా హత్యకేసుకు సంబంధించి 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. అయితే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులను గతంలో ఆశ్రయించారు. కానీ కోర్టులు తోసిపుచ్చాయి. చివరకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. జైలు నుంచి విడుదల కానున్నారు. మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు మాజీ మంత్రి వివేకా హత్యకు ప్లాన్ దగ్గర నుంచి, సాక్ష్యాధారాల ధ్వంసం వరకూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిదే కీలక పాత్ర అని ఆరోపణలు ఉన్నాయి. దస్తగిరి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డిలతోపాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కూడా వివేకా హత్యకేసులో భాగం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం నిందితుడిగా ఉన్నారు. అయితే అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.