తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ మార్చి 15న వైజాగ్‌లో ఏపీ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించనుంది. ఈ బహిరంగసభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంటి కీలక నేతలు హాజరుకానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా విశాఖ రైల్వేజోన్, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఈ సభ ద్వారా కాంగ్రెస్ గళం విప్పనుంది. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ అడ్డుకుంటామని, రైల్వేజోన్ ఏర్పాటు సహా ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామంటోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రేవంత్ రెడ్డి ఏపీ పర్యటనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద రేవంత్ రెడ్డి మాట్లాడటం వలన వచ్చే ఉపయోగం ఏమీ ఉండదని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన ఏపీకి రావటం కూడా టైమ్ వేస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా వంటి అంశాలపై మాట్లాడాల్సిన బీజేపీ నేతలు ఇప్పుడు ఏపీకి వస్తున్నారన్న బొత్స సత్యనారాయణ.. ఏం చెప్తారో చూద్దామంటూ ఎద్దేవా చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయంలోనూ మంత్రి క్లారిటీ ఇచ్చారు.
" నేను భీమిలి నుంచి పోటీ చేయను. నన్ను చీపురుపల్లి ప్రజలు అదరిస్తున్నారు. ప్రజల ఆదరణ లేకపోతేనే అక్కడ ఇక్కడా అంటూ పోటీ చేస్తారు. నేను చీపురుపల్లి నుంచే పోటీ చేస్తాను. అధిష్టానం నిర్ణయం ప్రకారం నా భార్య ఎంపీగా పోటీ చేస్తుంది. నాలుగు సిద్దం సభల ద్వారా వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చారు. మంచి చేశానని అనుకుంటే ఓటేసి మరో అవకాశం ఇవ్వాలన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశాం. ఇంకా ఏం కావాలో చెప్పమన్నారు." అని బొత్స అన్నారు.
చంద్రబాబు మాటలన్నీ అసత్యాలేనన్న బొత్స.. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న డ్రామాలు చూస్తున్నామని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ వెంపర్లాడి పొత్తులు పెట్టుకున్నారని.. ఇది చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. 14 ఏళ్లల్లో చేసిందేమీ లేక చంద్రబాబు ఆ గుమ్మం, ఈ గుమ్మం అంటూ తిరుగుతున్నారన్న బొత్స.. బీజేపీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నవాళ్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చెప్తారని అన్నారు. బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారన్న బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు మళ్లీ పొత్తులు పెట్టుకున్నారంటూ విమర్శించారు.