టీడీపీ- జనసేన - బీజేపీ కూటమిని 5 కోట్ల ఆంధ్రులు స్వాగతిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని మోదీ , చంద్రబాబు , పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే సభ కాబోతుందన్నారు. 175 నియోజకవర్గాల నుంచి 3 పార్టీల శ్రేణులు పాల్గొంటాయయని.. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.కాగా.. ఈ నెల 17న చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగే టీడీపీ కూటమి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా స్థలిని ఈరోజు ఉదయం యువనేత లోకేష్‌తో కలిసి ప్రత్తిపాటి పరిశీలించారు. లోకేష్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని యువనేత పరిశీలించారు. వివిధ కమిటీలతో భేటీ అయ్యి సభ ఏర్పాట్ల గురించి లోకేష్ చర్చించారు. లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణం వద్ద భూమి పూజా కార్యక్రమంలో నారా లోకేష్, మూడు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. పొత్తు కుదిరిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని మోదీ పాల్గొనే సభ ఏర్పాట్లను నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.