టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏ కార్యాలయంలోకైనా వెళ్లి.. ఏకపక్షంగా తనిఖీలు, జప్తులు, వారెంట్ లేకుండా అరెస్టులు, రికార్డుల సీజ్, సమాచార సేకరణ చేసేందుకు.. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసే గెజిటెడ్ అధికారులందరికీ అపరిమిత అధికారాలు కోరుతూ ప్రభుత్వానికి ఆ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ కొల్లి రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ లేఖను ఆధారం చేసుకుని ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు.
రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 5న రాసిన లేఖ ఆధారంగా ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని లోకేష్ కోరారు. ఎన్నికల్లో టీడీపీ నేతలు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల్లో ఇరికించాలన్న ఏకైక ఉద్దేశంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అక్రమ అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని ప్రస్తావించారు. ఇలాంటి చర్యలకు అనుమతివ్వడం టీడీపీ నాయకుల హక్కులను హరించడమేనని.. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగకూడదని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. దీనికి కొల్లి రాఘురామిరెడ్డిని వినియోగిస్తున్నారన్నారు.
ప్రాసిక్యూషన్, క్వాసీ జ్యుడీషియల్ అధికారాలను కల్పించాలని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కోరడం అసంబద్ధం అన్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం.. విచారణలు జరిపి నివేదిక మాత్రమే ఇస్తుందని గుర్తు చేశారు. అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల విషయంలో ఈ విభాగానికి అపరిమిత అధికారాలు ఇవ్వడం చెల్లదన్నారు. ఏపీ జీఎస్టీ, వ్యాట్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, గనులు తదితర మొత్తం 13 చట్టాల పరిధిలో తనిఖీలు చేసే అధికారాలను తమకు కల్పించాలని కోరడం ఆయా చట్ట నిబంధనలను అతిక్రమించడమే అవుతుందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో దగ్గరి సంబంధాలుండటం వల్లే కొల్లి రఘురామిరెడ్డి ఈ తరహా విజ్ఞప్తి చేశారని.. ప్రతివాదులందరూ విధులను దురుద్దేశపూర్వకంగా నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని లేఖ ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలన్నింటినీ అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరారు.