జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పిఠాపురంలో కాక రేపింది. 2024 ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ప్రకటించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈ సారి కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆ మేరకు ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో జనసైనికులు ఫుల్ ఖుషీలో ఉండగా.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ మద్దతుదారులు పవన్ కళ్యాణ్ మీద మండిపడుతున్నారు.
ఎన్‌వీఎస్‌ఎన్ వర్మకు టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు కోపంతో ఊగిపోయారు. పిఠాపురం టికెట్ వర్మకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత ఆగ్రహంతో టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టారు. ప్రధాన కూడళ్లలో వర్మకు మద్దతుగా నిరసనలు చేపట్టారు. పిఠాపురం టికెట్ వర్మకే కేటాయించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు, నారా లోకేష్ ఫ్లెక్సీలు చించేశారు. కరపత్రాలను కాల్చివేశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురం టీడీపీ తమ్ముళ్లు రగిలిపోతున్నారు.
ఎస్వీఎస్‌ఎన్ వర్మ విషయానికి వస్తే.. ఈయన తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగా గీత చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఈయనకు టీడీపీ టికెట్ నిరాకరించింది. దీంతో టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన వర్మ.. సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఓడిపోయిన వర్మ.. అప్పటి నుంచి టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి జనసేన తరుఫున పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో వర్మ మద్దతుదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోవైపు సీటు దక్కకపోతే టీడీపీకి రాజీనామా చేసి.. మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే ఆలోచనలో ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది.