రాష్ట్రంలో ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలయ్యిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాజ్యాగబద్ధ సంస్థ అయిన సర్వీస్ కమిషన్‌ను కూడా రాజకీయ లబ్ధికి, అక్రమాలకు వేదిక చేసి ముఖ్యమంత్రి జగన్ లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బలయ్యిందన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మునుపెన్నడూ లేని వివాదాలు ఎందుకు తలెత్తాయని.. వాటికి కారణాలు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకన అంటూ మోసపూరిత చర్యలతో రాజకీయ మూల్యాంకనంకు పాల్పడ్డారు అని మండిపడ్డారు. తమ వారిని పోస్టింగుల్లో కూర్చోబెట్టుకునేందుకు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకుని అర్హులైన వారికి అన్యాయం చేశారని అన్నారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమాలకు పాల్పడి సర్వీస్ కమిషన్ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీశారని అన్నారు. ఏపీపీఎస్సీని రాజకీయ పునారావాస కేంద్రంగా మార్చి.. అక్రమాలకు పాల్పడడమే కాకుండా హైకోర్టును సైతం మూల్యాంకనం విషయంలో తప్పు దోవ పట్టించే ప్రయత్నం విస్మయం కలిగించిందని అన్నారు.
ఈ అక్రమాల వెనుక ఉన్న సర్వీస్ కమిషన్ పెద్దల పాత్ర నిగ్గుతేలాలంటే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న గౌతమ్ సవాంగ్, సంస్థకు కార్యదర్శిగా పనిచేసిన మరో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను తక్షణమే సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. ముమ్మాటికి ప్రభుత్వ పెద్దల అక్రమాల వల్లనే పరీక్షల రద్దు జరిగిందని అన్నారు. సీబీఐ విచారణ జరిపితే ఉన్నతాధికారుల పాత్రతో పాటు ప్రభుత్వ పెద్దల అక్రమాలు కూడా బట్టబయలు అవుతాయని అన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే దీనిపై వెంటనే సిబీఐ విచారణ జరిపించాలన్నారు. అటు జాబ్ క్యాలెండర్ రాక, ఇటు ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగాలు లేక తీవ్ర నిరాశలో ఉన్న యువత.. తాజా అక్రమాలతో పూర్తిగా నిస్తృహలోకి వెళ్లే ప్రమాదం ఉంది అన్నారు. లక్షల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని, వారి ఆశలను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు.
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ (27/2018) ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాల మూల్యాంకనానికి రాష్ట్రప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలూ చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. దీంతో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీచేసిన జాబితాను రద్దుచేసింది.
తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వాన్ని, ఏపీపీఎస్సీని ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని పేర్కొంది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని, ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్ తీసుకున్న అభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో హక్కులను కోరబోమని న్యాయస్థానం ఆదేశాలతో ఏపీపీఎస్సీకి అఫిడవిట్ ఇచ్చారని గుర్తుచేసింది. ఈ అంశంపైనే చంద్రబాబు స్పందించారు.