ఫైబర్ నెట్ కేసులో ఐఏఎస్ అజయ్‌జైన్‌ను నిందితుడిగా చేర్చాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఐఏఎస్ అధికారి అజయ్‌జైన్ (ఎనర్జీశాఖ అప్పటి కార్యదర్శి) 2021 డిసెంబర్ 10న విజయవాడ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు 164 వాంగ్మూలం ఇచ్చారు. ఆయనను ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా చేర్చాలంటూ పిల్ వేశారు. ప్రజాధనంతో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి.. ఆయనను నిందితుడిగా చేర్చాలని పిల్ వేశామని విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చినందున నిర్ణయాల్లో భాగస్వామి అయిన అజయ్ జైన్‌ను నిందితుడిగా చేర్చాలని కోరామన్నారు.
పిల్ దాఖలు చేసి ఫలానా వ్యక్తిని నిందితుడిగా చేర్చాలని పిటిషనర్ కోరడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది.కేసు దర్యాప్తు కొనసాగుతుండగా ఫలానా వ్యక్తిని నిందితుడిగా చేర్చాలని సీఐడీకి తామెలా ఆదేశాలు ఇవ్వగలమని ప్రశ్నించింది. మేజిస్ట్రేట్ వద్ద ప్రస్తావించేందుకు ప్రత్యామ్నాయం ఉండగా హైకోర్టుకు రావడాన్ని ఆక్షేపించింది. ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. పిటిషనర్‌గా ట్రస్ట్‌ను పేర్కొంటూ వ్యాజ్యంలో వ్యక్తికి సంబంధించిన వివరాలు పేర్కొనడంపై అభ్యంతరం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. 164 వాంగ్మూలం నేపథ్యంలో అజయ్‌జైన్‌ను నిందితుడిగా చేర్చేలా సీఐడీని ఆదేశించాలని కోరుతూ ఏపీ టుమారో ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నల్లమోతు చక్రవర్తి హైకోర్టులో పిల్ వేశారు.