ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను పిలిపించుకుని మాట్లాడారు. ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన బుధవారం రాత్రి ఏడు గంటల సమయానికి మరో 9 మందికి లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణయాదవ్‌లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని చెప్పారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులుతో భేటీ అయ్యారు. ఈ స్థానం కూడా దాదాపు ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ తరఫున నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కచ్చితంగా గెలిచి తీరాలి: 2024 ఎన్నికలు రాష్ట్ర గతిని మారుస్తాయని, తెదేపా, జనసేన, భాజపా కూటమి పోరాడుతున్నది హింస, కక్ష సాధింపు, అరాచకాన్ని నమ్ముకున్న పార్టీతో అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్‌కల్యాణ్ వారితో అన్నారు. కచ్చితంగా గెలిచి తీరాలని ఉద్బోధించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ప్రతి దశలోనూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి తాను సేకరించిన, వివిధ సర్వేల ద్వారా వచ్చిన సమాచారంలోని ముఖ్య అంశాలూ వారికి తెలియజేశారు.
పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు.. రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికి ఆరు స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బుధవారం రాత్రి మరో 9 మందికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. ఇవికాక విజయనగరం జిల్లాలోని పాలకొండ, కాకినాడ జిల్లాలోని పిఠాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, ఏలూరు జిల్లాలోని పోలవరం, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు స్థానాల్లో.. ఆరు చోట్ల పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు తిరుపతికి చెందిన గంటా నరహరి జనసేన పార్టీలో చేరారు.. పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తిరుపతి స్థానం నుంచి పోటీ చేయాలని నరహరి కోరుకుంటున్నారు. అయితే ఆరణి శ్రీనివాసులుతో బుధవారం మాట్లాడి సానుకూల సంకేతాలు ఇవ్వడంతో తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మరో వైపు అమలాపురం స్థానం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, డీఎంఆర్ శేఖర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. అవనిగడ్డ నుంచి పోటీకి బండ్రెడ్డి రామకృష్ణ, తిరుపతి శ్రీనివాసరావు, మాదివాడ వెంకట కృష్ణాంజనేయులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా పాలకొండ నుంచి పోటీకి పార్టీ ఇంఛార్జ్ నిమ్మల నిబ్రం, తేజోవతి, ఎస్‌బీఐ విశ్రాంత మేనేజర్ కోరంగి నాగేశ్వరరావు ప్రయత్నాలు చేస్తున్నారు. రైల్వే కోడూరు నుంచి డాక్టర్ వెంకటసుబ్బయ్య, మురళి రేసులో ఉన్నారు. త్వరలోనే జనసేన పోటీచేసే స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.