తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి చిత్తూరు సిటింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరు ఖరారు కావడంపై తిరుపతిలో టీడీపీ, జనసేన పార్టీల నేతలు భగ్గుమన్నారు. గురువారం అత్యవసరంగా భేటీ అయిన ఇరు పార్టీల నాయకులూ ఈ అంశంపై తీవ్రంగా చర్చించారు. తిరుపతి నుంచి పోటీకి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తున్నామని, ఆయన కాకుంటే స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా బయటి వ్యక్తిని అభ్యర్థిగా నిర్ణయిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. చిత్తూరులో ఆరణి శ్రీనివాసులు అవినీతి, అక్రమాలపై చంద్రబాబు, లోకేశ్ బహిరంగ సభల్లో ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చిత్తూరులో వైసీపీకే పనికిరాని వ్యక్తి తిరుపతిలో మనకెలా పనికొస్తాడని నిలదీశారు. అతడి కోసం పనిచేసేది లేదంటూ మూకుమ్మడిగా తేల్చిచెప్పారు. స్థానికేతరుడైన ఆయన్ను అసలు తిరుపతిలోనే అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.