టైటానిక్ అంటే మనకు గుర్తొచ్చేవి మూడు. ఒకటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక సముద్రంలో మంచు గడ్డను ఢీకొట్టి మునిగిపోవడం. రెండోది హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన టైటానిక్ సినిమా. మూడోది మునిగిపోయిన ఆ టైటానిక్ షిప్‌ను చూసేందుకు వెళ్తుండగా పేలిపోయిన జలాంతర్గామి ప్రమాదం. టైటానిక్ నౌక మునిగిపోయి 110 ఏళ్లు దాటిపోయినా.. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఉన్నవారు ఇప్పుడు ఎవరూ భూమిపై బతికి లేకపోయినా ఇప్పటికీ ఆ ప్రమాదం, ఆ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లే ఉంటుంది.
ఆస్ట్రేలియన్ బిలియనీర్ క్లైవ్ పాల్మర్.. తాను టైటానిక్ లాంటిదే మరో నౌక నిర్మిస్తామని ప్రకటించారు. 2027 జూన్ నాటికి ఈ టైటానిక్ 2 నౌక ప్రయాణానికి సిద్ధమవుతుందని క్లైవ్ పాల్మర్ తెలిపారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. క్లైవ్ పాల్మర్ సంచలన ప్రకటన చేశారు. టైటానిక్ 2 నిర్మించాలన్న తన ప్రణాళిక గురించి వెల్లడించారు. ఈసారి నిర్మించనున్న టైటానిక్ 2 అసలైన టైటానిక్ షిప్‌ను మించి ఉంటుందని క్లైవ్ పాల్మర్ స్పష్టం చేశారు.
1912 లో టైటానిక్ అంటే ఓ కలల జలసౌధం అని.. అది మునిగిపోయి వందేళ్లు దాటిపోయినా.. దాని గొప్పతనం ఇప్పటికీ అలాగే ఉందని క్లైవ్ పాల్మర్ తెలిపారు. ప్రస్తుతం అలాంటి నౌకను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అందు కోసం ఒక బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.8300 కోట్ల వరకు వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని పాల్మర్ వివరించారు. ఈ టైటానిక్ 2 నౌక నిర్మాణానికి ఈ ఏడాది జూన్ తర్వాత టెండర్లను పిలిచే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ టైటానిక్ 2 ను 2025 లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా.. ఈ ఏడాది చివరి నాటికి నౌక నిర్మాణ సంస్థను ఖరారు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అయితే గతంలో కూడా టైటానిక్ 2 నిర్మాణం గురించి రెండుసార్లు ఇలాంటి ప్రకటనలు చేశారు. కానీ కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా టైటానిక్ 2 ప్రణాళికలు ఆచరణలోకి రావడం ఆలస్యమైందని క్లైవ్ పాల్మర్ వెల్లడించారు. కొత్తగా నిర్మించనున్న టైటానిక్ 2 నౌకలో 9 డెక్‌లలో మొత్తం 835 క్యాబిన్‌లు ఉండనున్నాయి. 2345 మంది ప్రయాణికులు ఉండేందుకు విశాలమైన స్థలం ఉండనుంది. ఇందులో దాదాపు సగం గదులను ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం రిజర్వ్ చేయనున్నారు. బాల్‌రూమ్, స్విమ్మింగ్ పూల్, టర్కిష్ బాత్‌రూమ్‌లతో నిర్మించనున్న ఈ ఓడ.. గతంలో ఉన్న టైటానిక్ షిప్‌లో ఉన్న ఇంటీరియర్స్, క్యాబిన్ లే అవుట్ కలిగి ఉంటుంది. ఇక టైటానిక్ ప్రయాణించిన సౌతాంప్టన్- న్యూయార్క్ మార్గంలోనే ఈ టైటానిక్ 2 కూడా ప్రయాణించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నౌకాయాన చరిత్రలోనే టైటానిక్ షిప్ ప్రమాదం పెను విషాదం మిగిల్చింది. 1912 లో మునిగిపోయిన ఈ భారీ ఓడ ఎంతోమందిని జలసమాధి అయ్యారు.