కెనడాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత సంతతికి చెందిన దంపతులు మృతిచెందారు. ఒంటారియా ప్రావిన్సుల్లో గతవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మార్చి 7న బ్రాంప్టన్ వాన్ కిర్క్ డ్రైవ్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలోని ఓ నివాసంలో మంటలు చెలరేగినట్టు పేర్కొన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దగ్దమైన ఆ ఇంట్లో మృతదేహాల అవశేషాలను కనుగొన్నారు. అయితే ఆ సమయంలో ఎందరు చనిపోయారనేది మాత్రం నిర్ధారించలేకపోయారు. కానీ, చివరకు శుక్రవారం ఆ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమైనట్టు ధ్రువీకరించారు.
అవశేషాలను 51 ఏళ్ల రాజీవ్ వారికూ, ఆయన భార్య 47 ఏళ్ల శిల్పా కోతా, వారి 16 ఏళ్ల కుమార్తె మెహక్ వారికూగా గుర్తించారు. అగ్నిప్రమాదానికి ముందు వారు అక్కడ నివాసం ఉండేవారని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందని పీల్ పోలీస్ కానిస్టేబుల్ టారిన్ యంగ్ స్థానిక మీడియా ఛానల్ నివేదించింది. ‘ఈ ప్రమాదంలో హత్య కోణం ఉందని అనుమానిస్తున్నాం.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నాం.. ఈ అగ్ని ప్రమాదవశాత్తు జరిగినది కాదని అగ్నిమాపక సిబ్బంది భావించినందున మేము కూడా అనుమానాస్పదం వ్యక్తం చేస్తున్నాము’ అని యంగ్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. అగ్ని ప్రమాదానికి గల కారణాల గురించి ప్రశ్నించగా.. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు అని యంగ్ చెప్పారు.
‘ఒక ఫైర్ మార్షల్‌గా అలాంటి వాటిని చూస్తున్నప్పుడు, ఎక్కువ సమయం లేనప్పుడు ఇది చాలా కఠినంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ మేము అన్ని మార్గాల్లోనూ శోధిస్తున్నాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. రాజీవ్ వారికూ పక్కంటిలో ఉండే కెన్నెత్ యూసఫ్ అనే అతడు... గత 15 ఏళ్లుగా వారు ఈ వీధిలో ఉంటున్నారని, ఎప్పుడూ వారికి ఎటువంటి సమస్య ఉన్నట్టు బయటపడలేదన్నారు.
ప్రమాదం జరిగిన రోజు మంటలు చెలరేగడంతో ఆ ఇంటి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని యూసఫ్ తెలిపారు. ‘శబ్దాలు విని మేము బయటకు వచ్చేసరికి ఇల్లు కాలిపోయింది.. చాలా బాధాకరం.. కొన్ని గంటల్లో మొత్తం కాలిబూడిదయ్యింది’ అని యూసఫ్ చెప్పినట్లు నివేదిక పేర్కొంది. ముగ్గురు కుటుంబ సభ్యుల మరణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని, సమాచారం తెలిసిన ఎవరైనా ముందుకు రావాలని పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ‘ఇంటిని మంటలు చుట్టుముట్టిన పరిస్థితులు దర్యాప్తులో కేంద్రీకృతమై ఉన్నాయి.. దీనిపై సమాచారం లేదా వీడియో ఫుటేజ్ (డ్యాష్‌క్యామ్ లేదా ఇతరత్రా) ఉన్న ఎవరైనా హోమిసైడ్ డిటెక్టివ్‌లను సంప్రదించాలని కోరారు’ అని పోలీసులు చెప్పారు.