ఢిల్లీ మద్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు శనివారం ఉదయం బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉదయం కోర్టుకు హాజరైన కేజ్రీవాల్‌కు.. రూ.15 వేలు పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే, ఆ సమన్లను దాటవేస్తున్న కేజ్రీవాల్.. రాజకీయ ప్రేరేపిత కుట్ర అని ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. తమను వేధించేందుకే ఈ కేసులు పెట్టించిందని ఆరోపణలు చేస్తున్నారు.
కాగా, ఢిల్లీ మధ్యం కేసులో ఈడీ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్ అరెస్ట్‌కు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని అదనపు సెషన్స్ జడ్జి రాకేశ్ సియాల్ సూచించారు. అంతేకాదు, కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి కోర్టు.. ఢిల్లీ ముఖ్యమంత్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
తాము పంపుతోన్న సమన్లకు స్పందించడం లేదంటూ ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. మొదటి 3 సమన్లకు కేజ్రీవాల్ రాలేదని ఫిబ్రవరిలోనే మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ కోర్టు.. ఫిబ్రవరి 17 విచారణకు వెళ్లాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. అయితే, ఆ సమయంలో ఢిల్లీ అసెంబ్లీలో తమ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష ఉండటంతో కేజ్రీవాల్ వర్చువల్‌గా హాజరయ్యారు. తర్వాతి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని, అందుకు అనుమతివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు అంగీకరించింది. దీనిపై విచారణ కొనసాగుతుండగానే ఈడీ పదే పదే సమన్లు పంపింది. మార్చి 4 న విచారణకు రావాలని పిలవగా.. కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు.. మార్చి 16 వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేసింది.