సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతీ పవర్ కంపెనీ పేరుతో 1999లో కోటి పెట్టుబడి పెట్టి.. 2009లో రూ. 32 కోట్లుకు షేర్ క్యాపిటల్ చేశారని అన్నారు. జగన్ రూ. 87లక్షల 8వేలు, భారతీ రూ.80 లక్షలు సరస్వతీ పవర్‌లో పెట్టుబడులు పెట్టారని అన్నారు. 60 రోజుల్లోనే రూ.18 కోట్ల 87లక్షలకు షేర్ వాల్యూ ఏ విధంగా పెంచగలిగారని ప్రశ్నించారు. ఈ మ్యాజిక్ ఏలా సాధ్యం అయ్యిందో జగన్‌రెడ్డి చెప్పాలని నిలదీశారు. అసలు సరస్వతీ కంపెనీకి కార్యాలయమే లేదని కనీసం గుడిసే కూడా లేదని చెప్పారు. షేర్ వాల్యూ మాత్రం ఎలా భారీగా పెరిగిందని ప్రశ్నించారు. కంపెనీ ఉత్పత్తులు లేవని, టర్నవర్ లేని కంపెనీకి ఇంత ఆదాయం ఎలా సాధ్యమయిందని ప్రశ్నించారు. సొంత వారిని అందల మెక్కించడమే జగన్ రెడ్డి సామాజిక న్యాయమా అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.